వారానికి ఆరు రోజులు.. అన్నా క్యాంటీన్ మెనూ ఇదే..!
ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 6:45 PM ISTవారానికి ఆరు రోజులు.. అన్నా క్యాంటీన్ మెనూ ఇదే..!
ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పతకాలను తిరిగి తీసుకొస్తుంది. అందులో అన్నా క్యాంటీన్లు కూడా ఒకటి. కేవలం రూ.5కే పేదవాడి కడుపు నింపడం కోసం కూటమి ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 203 అన్నా క్యాంటీన్లు అవసరం కాగా.. ప్రస్తుతం 180 సిద్ధం అయ్యాయి. తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్నా క్యాంటీన్ ప్రారంభం కాబోతుంది. ఇక మిగిలి 99 అన్నా క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నారు.
దీని తర్వాత సెప్టెంబర్ 5వ తేదీన మరో 99 అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. అన్నా క్యాంటీన్లలో ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరేకృష్ణ మూవ్‌మెంట్ అనే సంస్థ దక్కించుకుంది. తెలుగు దేశం పార్టీ ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. అక్షయపాత్ర ద్వారా అన్న క్యాంటీన్ల నిర్వహణ.. పేదోడికి శుచిశుబ్రతతతో మంచి భోజనం అని పేర్కొంది. అన్నా క్యాంటీన్లలో రూ.5కే బ్రేక్ ఫాస్ట్, లంచ్/డిన్నర్ అందించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఇండ్లీ, పూరి, ఉప్మా, పొంగల్ తదితర టిఫిన్లు ఉంటాయి. లంచ్/డిన్నర్‌లో వైట్ రైస్, కూర, పప్పు, పెరుగు, పచ్చడి అందిస్తారు. మధ్యాహ్నం లంచ్ 12.30 నుంచి 3 గంటల మధ్యలో ఉంటుంది. రాత్రి భోజనం 7.30 నుంచి 9 గంటల మధ్య అందించనున్నారు.