అంగన్వాడీ ఉద్యోగులకు శుభవార్త
రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు హోంమంత్రి అనిత తెలిపారు.
By - అంజి |
అంగన్వాడీ ఉద్యోగులకు శుభవార్త
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు హోంమంత్రి అనిత తెలిపారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్లు, పూర్తిస్థాయి వేతనాలు ఇస్తామన్నారు. అమరావతిలో అంగన్వాడీ కార్యకర్తలతో ఆమె సమావేశం అయ్యారు. కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించనున్నట్టు వెల్లడించారు. వేతనాల పెంపు డిమాండ్‌నూ అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, సూపర్‌వైజర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం పునరుద్ఘాటించారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిశు అభివృద్ధి సేవల (ICDS) నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కీలక చర్యలు చేపట్టిందని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అంగన్‌వాడీల జీతాలను రెండుసార్లు పెంచి చరిత్ర సృష్టించిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
అంగన్‌వాడీ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ సమస్యను పరిష్కరిస్తూ, 2025 ఏపీ బడ్జెట్‌లో రూ. 20 కోట్లు కేటాయించామని చెప్పారు. ప్రభుత్వం కొలువుదీరిన 9 నెలల్లోనే ఈ చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించామన్నారు. గర్భిణీలు, బాలింతలు మరియు పిల్లలకు సేవలను వేగంగా అందించేందుకు రూ. 75 కోట్ల వ్యయంతో 58,204 మంది అంగన్‌వాడీ సిబ్బందికి 5G స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేసినట్లు వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కోసం రూ. 86.68 లక్షలు నేరుగా ఆయా కేంద్రాలకు విడుదల చేశామన్నారు. టీవీలు, ఆర్‌ఓ (RO) వాటర్ యూనిట్ల వంటి ఆధునిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు.
మినీ అంగన్‌వాడీల అప్‌గ్రేడేషన్:
రాష్ట్రంలోని 5,000 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని మంత్రి అనిత వెల్లడించారు. దీనివల్ల మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లుగా పదోన్నతి లభించడంతో పాటు పూర్తి వేతనం అందుతుందన్నారు. అదనంగా 5,000 మంది హెల్పర్ల నియామకం కూడా చేపట్టనున్నట్లు చెప్పారు.
పెరిగిన హాజరు శాతం:
కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతం 70 శాతం నుండి 96 శాతానికి పెరిగిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది కోరిన 15 రోజుల వేసవి సెలవుల డిమాండ్‌ను కూడా ప్రభుత్వం ఆమోదించిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం వదిలివెళ్లిన అప్పుల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని.. అంగన్‌వాడీల మిగిలిన డిమాండ్లను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి అనిత హామీ ఇచ్చారు.