అమరావతి: మందుబాబులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ రూల్స్ 2024ను సవరణ చేస్తూ.. రాష్ట్రంలో పర్మిట్ రూమ్‌లకు పర్మిషన్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ మీనా జీవో ఎంఎస్ నెంబర్ 273కి అనుమతించింది. పర్మిట్ రూమ్‌కు సంబంధించి నియమ నిబంధనలను ఉత్తర్వుల్లో వెల్లడించింది.
పర్మిట్ రూమ్ లైసెన్స్‌కు వార్షిక ఫీజుగా రూ. 55 లక్షల వరకు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉన్న వారికి రూ. 5 లక్షలు ఫీజు.. రూ. 65 నుంచి రూ. 85 లక్షల రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉన్న వారికి రూ. 7 లక్షల 50 వేల ఫీజు నిర్ణయించింది. పర్మిట్ రూమ్ ఫీజును ఒకేసారి మొత్తం చెల్లించాలని సూచించారు. 2025- 26 సంవత్సరానికి మాత్రమే ఆ పర్మిట్ రూమ్ లైసెన్స్ వర్తిస్తుందని తెలిపారు. నవంబర్ 10వ తేదీ లోపల లైసెన్స్ ఫీజు చెల్లించాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు.
ఇందుకోసం లైసెన్సీలు ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 1000 చదరపు అడుగులు దాటకుండా పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని నిబంధనల్లో పేర్కొన్నారు. అందులో కిచెన్ ఉండకూడదు. కానీ.. సిద్ధంగా ఉంచిన స్నాక్స్ అమ్మవచ్చని ప్రభుత్వం పేర్కొంది. పర్మిట్ రూమ్‌లలో తాగేవారికి విడిగా మద్యం సర్వ్ చేయకూడదని, సీసాలు కొనుక్కుని వచ్చి మాత్రమే అక్కడ తాగాలని, మద్యం షాపుల పనివేళల్లో మాత్రమే పర్మిట్ రూమ్‌లు తెరిచి ఉంచాలని పేర్కొంది.