ఏపీలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టిస్తున్నారు: పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది.

By Srikanth Gundamalla  Published on  8 Jun 2024 4:00 PM GMT
andhra pradesh, ycp, perni nani,  tdp,

ఏపీలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టిస్తున్నారు: పేర్ని నాని 

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ మెజార్టీ స్థానాలను దక్కించుకున్నాయి. ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే మాజీమంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ప్రెస్‌మీట్‌ పెట్టి టీడీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు.

కార్యకర్తలు కూడా విధ్వంసం సృష్టిస్తున్నారని పేర్ని నాని అన్నారు. వారి వెనుక టీడీపీ అధినాయకత్వం ఉందని ఆరనోపించారు. ఈ గొడవల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దని పైనుంచి ఆదేశాలు వస్తున్నాయని చెప్పారు. డీజీపీ, ఎస్పీలకు సైతం ఈ ఆదేశాలు ఇచ్చారని పేర్ని నాని అన్నారు అందుకే ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. గతంలో యూపీ, బీహార్‌ రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవో.. ఇప్పుడు తండ్రీకొడుకులు అలానే హింసాత్మక రాష్ట్రంగా మారుస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మర్డర్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వారు, రౌడీషీటర్లు స్థానిక సీఐ, డీఎస్పీలను బెదిరించే పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయని పేర్నినాని అన్నారు. ఉద్యోగం చేయాలనుకుంటున్నావా? లేదా? అంటూ పోలీసు అధికారులను భయపెడుతున్నారని అన్నారు. తాము ఊరికే అనడం లేదనీ.. సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ వీడియోలను హైకోర్టుకు సమర్పించి.. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతామని వైసీపీ మాజీమంత్రి పేర్ని నాని అన్నారు.

Next Story