వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్
ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టను విడుదల చేసింది.
By Srikanth Gundamalla
వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్
ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టను విడుదల చేసింది. రెండు పేజీలతో కూడిన వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేశారు. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల విస్తరణతో పాటుగా.. 9 ముఖ్యమైన హామీలతో వైఎస్సార్‌సీపీ 2024 మేనిఫెస్టోను సీఎం జగన్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతల మోసాలపై మండిపడ్డారు. చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతూ మోసాలు చేయాలని చూస్తారని అన్నారు. కానీ.. తాము అలా కాదు అనీ.. అమలు సాధ్యం అయ్యే అంశాలనే మేనిఫెస్టోలో పెట్టి కచ్చితంగా అమలు చేసి తీరుతామని సీఎం జగన్ పేర్కొన్నారు.
సీఎం జగన్ ఎప్పుడూ పేదవాళ్ల కోసం అడుగులు వేస్తాడని సీఎం జగన్ అన్నారు. పేదవాళ్లకు మంచి చేసే విషయంలో తనకు ఉన్న ప్రేమ మరెవరికీ లేదని చెప్పారు. తనకు కల్మషం లేదనీ.. పెన్షన్ల విషయంలో అవ్వాతాతల మీద చూపించిన ప్రేమ చరిత్రలో ఎవరూ చూపించలేరని సీఎం జగన్ అన్నారు.
రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500 దాకా పెంపు (2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంచుతాం) అని సీఎం జగన్ అన్నారు. 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఏపీ తప్ప మరోటి లేదన్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్ చేయూత తదితర పథకాలు కొనసాగించనున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ చేయూత పథకం 4 విడతల్లో రూ.75వేల నుంచి రూ.లక్షా 50వేలకు పెంచనున్నట్లు చెప్పారు. అమ్మొడి రెండు వేలకు పెంచుతామనీ.. రూ.17వేలు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. తల్లుల చేతికి రూ.15వేలు అందిస్తామన్నారు. వైద్యం, ఆరోగ్యశ్రీ విస్తరణ చేయనున్నట్లు చెప్పారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని కొనసాగించనున్నట్లు జగన్ చెప్పారు.
మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ.50వేలు అందజేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ ఉంటుందని చెప్పారు. ఆటోలకు, ట్యాక్సీలకు వచ్చే ఐదేళ్లలో రూ.50వేలు ఇస్తామన్నారు. వాహనమిత్రను ఐదేళ్లలో రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచుతామని జగన్ అన్నారు. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహనమిత్ర వర్తింప చేస్తామని చెప్పారు. అలాగే వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగిస్తామని సీఎం జగన్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా కరెంటు ఇస్తామన్నారు.