ఈ నెల 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర: మంత్రి బొత్స
తొలి విడత వైసీపీ బస్సు యాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ వివరాలు వెల్లడించారు.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 12:04 PM ISTఈ నెల 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర: మంత్రి బొత్స
ఏపీలో ఎన్నికలు ఇప్పట్లో లేవు కానీ.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని భావిస్తోంది. అందుకే బస్సు యాత్ర మొదలు పెడుతోంది. కాగా.. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. మరోవైపు లోకేశ్ కూడా కొద్దిరోజుల పాటు యాత్ర నిర్వహించారు. ఇప్పుడు వైసీపీ కూడా బస్సు యాత్రను మొదలు పెట్టనుంది. తొలి విడత వైసీపీ బస్సు యాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ వివరాలు వెల్లడించారు.
నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించేందుకు సామాజిక బస్సు యాత్ర చేపడుతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి బొత్స.. సామాజిక బస్సు యాత్ర తొలి దశ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 26న బస్సు యాత్రను ప్రారంభిస్తామని.. ఇచ్చాపురం నుంచి ఈ యాత్ర మొదలవుతుందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 'వై ఏపీ నీడ్స్ జగన్' పేరుతో జనాల్లోకి వెళ్తున్నామని మంత్రి బొత్స చెప్పారు.
ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీలన్నీ జగన్ సర్కార్ నెరవేర్చిందని మంత్రి బొత్స అన్నారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందని.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని వెల్లడించారు. గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కన్న కలలను గ్రామ సచివాలయాల ద్వారా నెరవేర్చామని అన్నారు. దేశంలో ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. విద్య, ప్రజారోగ్యం, వ్యవసాయం సహా అన్ని రంగాల్లో ఎన్నో మార్పులు తెచ్చామన్నారు. సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
కాగా.. ఈ బస్సు యాత్రలో సీఎం జగన్ స్వయంగా పాల్గొంటారు. దీని ద్వారా ప్రజల్లో ప్రభుత్వానికి ఉన్న మద్దతును గుర్తించనున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ జగన్ సుదీర్ఘకాలం పాటు పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. యాత్ర ద్వారా ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్‌ను బట్టి వచ్చే ఎన్నికల్లో వ్యూహాలను రచించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.