తుపాకీతో కాల్చుకుని ఏపీలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒక మహిళా కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 7:09 AM GMTతుపాకీతో కాల్చుకుని ఏపీలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒక మహిళా కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విధి నిర్వహణలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ వేదవతి సూసైడ్ చేసుకుంది.
పుంగనూరు సమీపంలో ఉన్న బింగానిపల్లెకు చెందిన వేదవతికి, మదనపల్లెకు చెందిన దస్తగిరి ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల కూతురు కూడా ఉంది. అయితే.. వేదవతి భర్త దస్తగరి పుంగనూరులోని ప్రయివేట్ కోచింగ్ సెంటర్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. వేదవతికి చిత్తూరు నుంచి ఏడాది కిందట అన్నమయ్య జిల్లాకు బదిలీ అయ్యింది. ప్రస్తుతం దస్తగిరితో కలిసి రాయచోటి పట్టణంలోని రాజీవ్ స్వగృహకు పక్కన ఉన్న ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు.
అయితే.. ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి తన చేతిలో ఉన్న గన్‌తోనే కాల్చుకుని సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. గార్డు గది నుంచి పెద్ద శబ్ధం రావడంతో పోలీసులు, సిబ్బంది పరుగెత్తుకు వచ్చి చూశారు. అయితే.. వేదవతి చనిపోయినట్లు గుర్తించారు. భార్య మరణం గురించి భర్త దస్తగిరి చెప్పారు. అతను కూడా అక్కడికి వెళ్లి భార్య మృతదేహాన్ని రాయచోటి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం భర్త దస్తగిరిని విచారిస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఆత్మహత్యకు ముందు వేదవతి ఒక ఫోన్‌కాల్ మాట్లాడిందని సమాచారం. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తన్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.