నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో విషాదం చోటుచేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు భార్యభర్తలు గురుశేఖర్‌రెడ్డి, దస్తగిరమ్మ, వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్తులు బయటకు తీశారు. వీరికి మరో కుమార్తె కూడా ఉంది. ప్రసన్న పొద్దుటూరులో చదువుకుంటోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. అంతా రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను బయటకు తీశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.