ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్నారుల భద్రతే లక్ష్యంగా సోషల్ మీడియా నియంత్రణపై సంచలన నిర్ణయం తీసుకుంది.
By - అంజి |
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్నారుల భద్రతే లక్ష్యంగా సోషల్ మీడియా నియంత్రణపై సంచలన నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో పాటు 13 నుండి 16 ఏళ్ల మధ్య వయస్సు గల కిశోర ప్రాయం (Teenagers) వారి కోసం డిజిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తోంది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో జరిగిన మంత్రుల కమిటీ (GoM) సమావేశంలో ఈ ప్రతిపాదనలకు రూపకల్పన చేశారు.
పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని వయస్సు ఆధారిత కంటెంట్ యాక్సెస్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సింగపూర్, ఆస్ట్రేలియా, డెన్మార్క్ వంటి దేశాల్లో అమలులో ఉన్న అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలని సూచించారు. ముఖ్యంగా వయస్సును నిర్ధారించడానికి 'డిజీ లాకర్' (DigiLocker) ద్వారా 'ఏజ్ టోకెన్' (Age Tokens) వంటి పద్ధతులను పరిశీలిస్తున్నారు. దీనివల్ల ప్రైవసీ దెబ్బతినకుండానే యూజర్ వయస్సును ప్లాట్‌ఫారమ్‌లు గుర్తించే వీలుంటుంది.
కేవలం నిబంధనలే కాకుండా, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. పాఠశాలల్లో 'నో బ్యాగ్ డే' రోజున డిజిటల్ సేఫ్టీ గురించి బోధించడం, పేరెంట్-టీచర్ సమావేశాల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం మరియు స్వయం సహాయక సంఘాల (SHGs) ద్వారా మహిళలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించనున్నారు. అదే సమయంలో మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం ఐటీ చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.