Andhra Pradesh: ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు నిలిపివేత
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీల కోసం గతంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 6 Jun 2024 3:07 PM ISTAndhra Pradesh: ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు నిలిపివేత
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీల కోసం గతంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా ఈ బదిలీ ఉత్తర్వులపై కీలక ప్రకటన వెలువడింది. ఎలాంటి బదిలీలూ చేయొద్దని డీఈవోలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ ఏశారు. ఎన్నికలకు ముందు మొత్తం 1800 మంది టీచర్ల బదిలీలు జరగ్గా.. పైరవీలు, సిఫార్సులతో బదిలీలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే మొత్తంగా బదిలీలనే నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది విద్యాశాఖ. ముఖ్యమంత్రి పేషీలోని కొందరు అధికారుల ఒత్తిడితో పైరవీలు, సిఫార్సులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు పచ్చజెండా ఊపింది. బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలతో జీవో నెంబర్ 47ను విడుదల చేసింది. 2023 ఏప్రిల్ నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న అందరూ బదిలీలకు అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కానీ పలు కారణాల నేపథ్యంలో తాజాగా గత ఉత్తర్వులను నిలిపివేశారు అధికారులు.
కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ఘన విజయాన్ని అందుకుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి ముహూర్తం కూడా ఖరారు అయ్యింది. ఈ క్రమంలో అప్పుడే పాలనాపరంగా కీలక నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి. అటు మంత్రివర్గ ఏర్పాటుతో పాటుగా తన టీంను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో చంద్రబాబు సిద్దం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల అమలు నిలుపుదలపైనా పలు డెసీషన్స్ తీసుకుంటున్నారు.