ఏపీలోనూ పోలింగ్ సమయాన్ని పెంచండి.. ఈసీకి టీడీపీ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎండల తీవ్రత కారణంగా పోలింగ్ సమయాల్లో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ కోరింది.
By Srikanth Gundamalla Published on 2 May 2024 11:15 AM GMTఏపీలోనూ పోలింగ్ సమయాన్ని పెంచండి.. ఈసీకి టీడీపీ విజ్ఞప్తి
ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు విజ్ఙప్తి చేశాయి. దాంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు..ఈ అంశాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎండల కారణంగా ఓటింగ్ శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయనీ రాజకీయ పార్టీలు చెప్పడంతో.. దాన్ని పెంచడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం కూడా సానుకూలంగా స్పందించింది. తెలంగాణలో పోలింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు పొడిగించింది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎండల తీవ్రత కారణంగా పోలింగ్ సమయాల్లో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ కోరింది. మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయని పేర్కొంది. ఆ సమయంలో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదని వివరించింది. దాంతో.. పోలింగ్ శాతం తగ్గే అవకాశాలు లేకపోలేదని తెలిపింది. ఈ మేరకు పోలింగ్ సమయాల్లో స్వల్ప మార్పులు చేయాలని టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఉదయం 7 గంటల నుంచి సాయత్రం 5 వరకు ఉన్న పోలింగ్ సమయాన్ని.. మరో గంటపాటు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ఇలా చేయడం ద్వారా ఓటింగ్ శాతం పెరుగుతుందని ఈసీకి రాసిన లేఖలో కనకమేడల వివరించారు. అలాగే ఇప్పటికే తెలంగాణలో ఓటింగ్ సమయాన్ని పెంచిన విషయాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.