బస్సుల్లో రూ.10 నాణేలు తీసుకోవాల్సిందే: APSRTC

ఆర్‌బీఐ పదే పదే పది రూపాయల నాణేం గురించి ప్రకటనలు చేస్తున్నా.. ప్రజల్లో మాత్రం అపోహలు అలాగే ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on  12 Sep 2024 1:59 AM GMT
బస్సుల్లో రూ.10 నాణేలు తీసుకోవాల్సిందే: APSRTC

ఆర్‌బీఐ పదే పదే పది రూపాయల నాణేం గురించి ప్రకటనలు చేస్తున్నా.. ప్రజల్లో మాత్రం అపోహలు అలాగే ఉన్నాయి. పైగా వ్యాపారులు కూడా ఈ నాణేన్ని తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దాంతో.. పెద్ద ఎత్తున నాణేలు బ్యాంకుల్లో ఉండిపోతున్నాయి. ఇంకొన్ని ప్రజల వద్ద ఉండిపోయాయి. తాజాగా ఈ అంశంపై ఏపీఎస్‌ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఆర్టీసీ బస్సుల్లో రూ.10 నాణేలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు రూ.10 నాణేలు ఇస్తే వాటిని స్వీకరించాలని సూచించింది. ప్రజల నుంచి ఈ మేరకు ఫిర్యాదులు రావడంతో ఏపీఎస్ ఆర్టీసీ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ యాజమాన్యం అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఆర్టీసీ బస్టాండుల్లో షాపుల్లో కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలియజేశారు.

ఇటీవల తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో కూడా రూ.10 నాణేలు స్వీకరించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు ఇచ్చే రూ.10 నాణేలు తీసుకోవాలని ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లను యాజమాన్యం ఆదేశించింది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా, మరికొన్ని రాష్ట్రాల్లో రూ.10 నాణేలపై అందరిలో అపోహలు ఉన్నాయి. కిరాణా, బడ్డీ షాపులు, చిన్న చిన్న హోటల్స్, కూరగాయల వ్యాపారులు ఇలా ప్రతి చోట చిల్లర నాణేలను స్వీకరించడం లేదు. దీంతో రూ.10నాణేలు బ్యాంకుల్లో పేరుకుపోయాయి.. అందుకే ఆర్బీఐ రూ.10 నాణేలపై క్లారిటీ ఇచ్చింది. వాస్తవానికి 2009 మార్చి నుంచి 2017 జూన్‌ మధ్య 14 సందర్భాల్లో పది రూపాయల నాణేలు వివిధ డిజైన్లలో విడుదల చేశారు. కొన్నాళ్ల పాటు వీటి చలామాణి బాగే ఉండింది. కానీ.. ఏం జరిగిందో తెలియదు కానీ.. ప్రజల్లో అపోహ మొదలైంది. దీన్ని పోగొట్టేందుకు ఆర్బీఐ విశ్వప్రయత్నాలు చేస్తున్నా విఫలం అవుతూనే ఉన్నాయి.

Next Story