ఏపీకి భారీ వర్ష సూచన.. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు
బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 19 July 2024 12:30 PM ISTఏపీకి భారీ వర్ష సూచన.. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు
బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, అధికారులకు పలు సూచనలు చేశారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే అక్కడ తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని సూచించారు.
అయితే.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత స్పందించారు. ఆమె శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి కాలినడకన కొండపైకి వెళ్లారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తాను కూడా అధికారులతో మాట్లాడానాననీ.. అప్రమత్తం చేశానని తెలిపారు మంత్రి అనిత. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పానన్నారు. ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడినట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వర్షాలతో ఎక్కడ ఇబ్బంది తలెత్తినా వెంటనే స్పందించి సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత వెల్లడించారు.