లోక్‌సభ స్పీకర్‌ పదవిపై పురందేశ్వరి ఏమన్నారంటే..

కేంద్ర కేబినెట్‌ కూర్పుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడారు.

By Srikanth Gundamalla  Published on  9 Jun 2024 4:44 PM IST
andhra Pradesh, purandeswari,  speaker,

లోక్‌సభ స్పీకర్‌ పదవిపై పురందేశ్వరి ఏమన్నారంటే.. 

కేంద్ర కేబినెట్‌ కూర్పుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడారు. మంత్రి వర్గ కూర్పు చాలా బాగా జరిగిందనీ.. ఏపీ నుంచి సరైన ప్రాతినిథ్యం లభించిందని అన్నారు. ముగ్గురికి కేంద్రమంత్రులుగా అవకాశం రావడం సంతోషంగా ఉందని చెప్పారు. కేబినెట్‌లో నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు మంత్రిగా అవకాశం లభించడం మంచి విషయమన్నారు. ఆయన కార్యకర్తగా కష్టపడి పనిచేశారని అన్నారు. అలాంటి వ్యక్తిని గుర్తించి టికెట్‌ ఇవ్వడం నుంచి.. కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవడం వరకు అన్ని బీజేపీలోనే సాధ్యమన్నారు పురందేశ్వరి. ఇది ప్రతి బీజేపీ కార్యకర్తలో ఉత్తేజాన్ని నింపుతుందని అన్నారు.

ఏపీలో కూటమిగా పోటీ చేసి ఘన విజయాన్ని అందుకున్నామని పురందేశ్వరి అన్నారు. కేంద్ర కేబినెట్ కూర్పు నేపథ్యంలో.. టీడీపీ వారు రెండు పేర్లు ఇచ్చారనీ..వారిని మంత్రి వర్గంలోకి తీసుకున్నట్లు చెప్పారు. మొదట్నుంచి బీజేపీ కార్యకర్తగా అంకితభావంతో పనిచేసిన శ్రీనివాసవర్మను కేబినెట్‌లోకి తీసుకున్నారని పురందేశ్వరి చెప్పారు. ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కించుకున్నవారంతా.. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారని పురందేశ్వరి అన్నారు. ఏపీకి నిధులు తీసుకురావడంలో కృషి చేయాలన్నరు.

లోక్‌సభ స్పీకర్‌గా పురందేశ్వరికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు మీడియా ప్రతినిధులు ఇదే విషయాన్ని పురందేశ్వరి అడగ్గా.. ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. రెండుసార్లు ఇదే ప్రశ్నను రిపీట్‌గా అడిగితే.. రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో.. ఆమె స్పీకర్‌గా ఎన్నిక అవుతారా లేదా అన్నదానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.

Next Story