సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ టీడీపీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.
By Srikanth Gundamalla
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ టీడీపీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ పార్టీ ముఖ్య నేత ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీ పార్టీలో చేరారు. కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు వైసీపీలో చేరారు. యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరికృష్ణ, ఎల్.భాస్కర్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు.
వైసీపీలో టీడీపీ నేతలు చేరిన కార్యక్రమంలో తుని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజాతో పాటు, కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కూడా పాల్గొన్నారు. వైసీపీ పార్టీలో చేరిన సందర్భంగా యనమల కృష్ణుడు కీలక కామెంట్స్ చేశారు. టీడీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీలో డబ్బున్న వారికి, ఎన్నారైలకే టికెట్లు ఇచ్చారని అన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని మోసం చేస్తున్నారంటూ యనమల కృష్ణుడు ఆవేదన చెందారు. టీడీపీలో గత 42 ఏళ్లు గా పనిచేస్తున్నాననీ.. చంద్రబాబు, యనమల మోసం వల్లే తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. చంద్రబాబు బీసీలను మోసం చేశారంటూ ఆయన మండిపడ్డారు. దానికి తానే ఒక ఉదాహరణ అంటూ యనమల కృష్ణుడు చెప్పుకొచ్చారు. తాను ప్రజలకు సేవ చేసేందుకే పార్టీలోకి వచ్చాననీ.. ఇక ముందు కూడా అదే చేస్తానని అన్నారు.
తనకు తుని టికెట్ ఇవ్వడమే కాకుండా.. టీడీపీలో ఘోర అవమానం జరిగిందని చెప్పారు. తునిలో ఏ రోజూ యనమల రామకృష్ణుడు కనిపంచలేదు అంటూ మండిపడ్డారు. ఐదేళ్లలో సీఎం జగన్ పాలన రాష్ట్రంలో చాలా బాగా సాగిందని ఆయన చెప్పారు. సీఎం జగన్ పాలనను చూసే తాను వైసీపీలో చేరుతున్నట్లు చెప్పారు. జగన్‌ను మరోసారి సీఎం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానీ.. ఆ మేర కృషి చేస్తానని అన్నారు. కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్, తుని ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా గెలుపునకు కృషి చేస్తానని యనమల కృష్ణుడు చెప్పారు.