Andhra Pradesh: జగన్‌కు భద్రతపై పోలీసుల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ సెక్యూరిటీపై హైకోర్టుకు వెళ్లారు.
By Srikanth Gundamalla Published on 6 Aug 2024 1:31 AM GMTAndhra Pradesh: జగన్‌కు భద్రతపై పోలీసుల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ సెక్యూరిటీపై హైకోర్టుకు వెళ్లారు. వ్యక్తిగత భద్రత విషయంలో .. గతంలో తనకు ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని వైఎస్ జగన్ పిటిషన్‌లో కోరారు. అలాగే, కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీని తొలగించినట్టు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై తాజాగా ఏపీ పోలీస్ శాఖ స్పందించింది. కీలక ప్రకటన చేసింది.
మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్‌కు నిబంధనల ప్రకారమే భద్రతా సిబ్బందిని కేటాయించామని పోలీసు శాఖ పేర్కొంది. ఆయనకు ప్రస్తుతం జెడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతోందని వెల్లడించింది. భద్రత తగ్గించారని ఆయన చెప్పిన విషయ నిజం కాదని తెలిపింది. ఈ మేరకు పోలీసు శాఖ, ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశారు. తన భద్రతను తగ్గించేశారని జగన్ హైకోర్టుకు వెళ్లడాన్ని తప్పుబట్టాయి. జూన్ 3 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆయన వాదనలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఆ హోదాలో అదనంగా కల్పించే భద్రత మాత్రమే తగ్గించామన్నారు. ప్రస్తుతం మాజీ సీఎం అయిన ఆయనకు ముఖ్యమంత్రికి కల్పించే భద్రత ఇవ్వటం కుదరదని పోలీసు శాఖ స్పష్టం చేసింది. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఎంత భద్రత కల్పించామో.. ఇప్పుడు జగన్‌కూ అంతే భద్రత కొనసాగిస్తున్నామంటూ పోలీసు శాఖ కీలక ప్రకటన చేసింది.
మాజీ సీఎంకు కల్పించే భద్రతలో భాగంగా జగన్‌కు 58 మంది సిబ్బందితో సెక్యూరిటీ కొనసాగుతోందని పోలీసు శాఖ తెలిపింది. ఆయన ఇంటి వద్ద 10 మంది సాయుధ గార్డుల భద్రత ఉందన్నది. షిప్టునకు ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు పీఎస్‌వోలు 24 గంటల పాటు భద్రత కల్పిస్తున్నారని చెప్పింది. మొత్తం 24 మంది సిబ్బందితో రెండు ఎస్కార్ట్ బృందాలు నిరంతరం జగన్‌తో ఉంటున్నాయని పోలీసు శాఖ చెప్పింది.పగలూ, రాత్రి కలిపి మొత్తం ఐదుగురు వాచర్లను ఏర్పాటు చేశామనీ.. ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారిని భద్రత ఇన్‌ఛార్జిగా పెట్టామనీ వివరించింది.మూడు షిఫ్టుల్లో పనిచేసేలా మొత్తం ఆరుగురు ఫ్రిష్కర్లు, స్క్రీనర్లు, నిరంతం అందుబాటులో ఉండేలా ఆరుగురు డ్రైవర్లను జగన్‌కు కేటాయించామని ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ తెలిపింది.