ఆంధ్రప్రదేశ్‌లో 6,100 కానిస్టేబుల్ పోస్టులపై బిగ్ అప్‌డేట్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది.
By Srikanth Gundamalla Published on 27 Aug 2024 7:35 AM ISTఆంధ్రప్రదేశ్‌లో 6,100 కానిస్టేబుల్ పోస్టులపై బిగ్ అప్‌డేట్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది. వైసీపీ హాయంలో కోర్టుకు ఎక్కిన వ్యవహారంపై దృష్టి పెట్టింది. న్యాయనిపుణుల సహకారంతో న్యాయమైన చిక్కులను తప్పించి.. ఆగిన 6,100 పోలీస్ కానిస్టేబుల్ నియామకాలను ముందుకు తీసుకెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది. అయితే.. ఒకట్రెండు రోజుల్లోనే ఫిట్‌నెస్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
2022 నవంబరులో 6,100 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి గత జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 4.58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి చివరి వారంలో ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 5న ఫలితాలు ప్రకటిస్తూ... 95,208 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. అర్హులైన వారికి దేహదారుఢ్య పరీక్షలు మార్చి 13 నుంచి 20 వరకూ నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించి హాల్ టికెట్లు జారీ చేశారు. కానీ.. అదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ప్రక్రియను వాయిదా పడింది. అయితే.. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లో సివిల్ హోం గార్డులకు 15 శాతం, ఏపీఎస్పీ హోం గార్డులకు 25 శాతం రిజర్వేషన్ ఇచ్చింది. దాంతో వివాదం మొదలైంది. జగన్ పాదయాత్రలో ఆయన వెంట నడిచి, హోంగార్డు ఉద్యోగాలు పొందిన కొందరు తమకు కటాఫ్ తగ్గించాలని, అందరినీ అర్హులుగా ప్రకటించాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆ తర్వాత ఏపీలో ప్రభుత్వ మార్పు జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఇక తాజాగా కూటమి ప్రభుత్వం ఈ కానిస్టేబుల్ నియామకాలను పూర్తి చేసేందుకు చ్యలు తీసుకుంటోంది.