అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమలు చేయబోతున్నట్లు చెప్పారు మంత్రులు కొల్లు రవీంద్ర.

By Srikanth Gundamalla  Published on  17 Sep 2024 2:30 PM GMT
అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమలు చేయబోతున్నట్లు చెప్పారు మంత్రులు కొల్లు రవీంద్ర. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అందించేలా కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించడం జరుగుతుందని వెల్లడించారు. సచివాలయంలో ఇవాళ కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశం అయ్యింది. సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు కొల్లురవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు.

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్య విధానాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఎక్సైజ్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని చె ప్పారు. సెబ్ పేరుతో వ్యవస్థను విధ్వంసం చేశారని అన్నారు. 70 శాతం ఉద్యోగులను వారి అక్రమ మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఉపయోగించుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో మల్టీ నేషనల్ కంపెనీల బ్రాండ్స్ లేకుండా చేశారు. వారి సొంత బ్రాండులైన జె బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తర్వాత దశల వారీగా మద్యం నియంత్రణ అంటూ మోసం చేశారని అన్నారు. నాసిరకం మద్యం తాగి చాలా మంది అనారోగ్యంపాలై మృత్యువాత పడ్డారని చెప్పారు. దాదాపు రూ.19 వేల కోట్ల నిధులు దారి మళ్లించారని చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర.

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నూతన మద్య విధానంపై సీఎం ఆదేశాలతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ చేసి బెస్ట్ పాలసీలపై అధ్యయనం చేసిందన్నారు. 6 రాష్ట్రాల్లో నూతన పాలసీపై అధ్యయనం చేశామనీ చెప్పారు. సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం అందించేలా ప్రపోజల్స్ ను కేబినెట్ ముందు ఉంచుతామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం విక్రయాలను నిలిపివేశామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. గత ప్రభుత్వ మద్యం పాలసీ ఈ సెప్టెంబర్ తో క్లోజ్ అవుతుందని పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి నూతన మద్య విధానం అమలు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు 10 రిజర్వేషన్లు కల్పించి మద్యం షాపులు కేటాయిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.

Next Story