ఒకే రాజధాని అమరావతి..మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి: నారా లోకేశ్
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించాయి.
By Srikanth Gundamalla Published on 5 Jun 2024 6:40 AM ISTఒకే రాజధాని అమరావతి..మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి: నారా లోకేశ్
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించాయి. మెజార్టీ స్థానాలను దక్కించుకున్నాయి. అధికార పార్టీ వైసీపీకి ప్రజలు షాక్ ఇచ్చారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇక ఏపీలో ఫలితాలపై టీడీపీ జాతీయ కార్యదర్శి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు కూటమిపై బాధ్యత పెట్టారని అన్నారు. మంగళగిరి అభ్యర్థిగా భారీ మెజార్టీతో నారా లోకేశ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తామని నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ బాద్యతలను నెరవేర్చేందుకు అహర్నిషలు కష్టపడతామని లోకేశ్ వ్యాఖ్యానించారు. మూడు పార్టీలు కలిసి కట్టుగా పనిచేస్తాయనీ.. తద్వారా ఏపీకి పూర్వవైభవాన్ని తీసుకొస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన విజయాన్ని ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుని పనిచేస్తామని అన్నారు. 1985 నుంచి మంగళగిరిలో పసుపు జెండా ఎగరలేదనీ.. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల సహకారంతోనే తాను 91వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించగలిగాను అని లోకేశ్ అన్నారు.
మంగళగిరి అభివృద్ధికి కృషి చేస్తాననీ.. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని నారా లోకేశ్ అన్నారు. ఇక రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. కక్ష సాధింపులు, వేధింపులు ఇలాంటివి తమకు తెలియదన్నారు. ఆస్తులను ధ్వంసం చేసే తత్వం తమది కాదన్నారు. వ్యక్తిగతంగా కేసులు పెట్టి జైలుకు పంపే నీచపు పనులు తాము చేయబోము అన్నారు లోకేశ్. తప్పు చేయని వారిపై కక్ష సాధింపులు ఏమీ ఉండవంటూ కామెంట్స్ చేశారు. ఇక విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన వాటిని అడుగుతామన్నారు. ఇక ప్రభుత్వం తన పాత్ర ఏంటన్నది చంద్రబాబు నిర్ణయిస్తారని వెల్లడించారు. అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఒకే రాజధాని అమరావతి... అనే నినాదానికి మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయని నారా లోకేశ్ స్పష్టం చేశారు.