ఈసారి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి రోజా..?
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 28 Jan 2024 10:34 AM IST
ఈసారి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి రోజా..?
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి. గతంలో టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్నారు. ఆమె ఏపీ వ్యాప్తంగా పర్యటనల్లో పాల్గొంటూ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ కూడా వారి ప్లాన్‌లను సిద్ధం చేసుకుంటుంది. ఆయా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులను చేస్తోంది. ఈ క్రమంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉండరనే వార్త వినిపిస్తోంది.
అసెంబ్లీ స్థానం నుంచి కాకుండా.. మంత్రి రోజాను ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి రంగంలోకి దించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందని సమాచారం. ఆ మేరకు ప్రకాశం జిల్లా నేతలకు ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో వైసీపీ నేతలు మంతనాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అధిష్టానం రోజా పేరును ప్రతిపాదించిందని తెలుస్తోంది. ఇక తాను పెట్టిన షరతులకు ఎంపీ మాగుంట అంగీకరించని నేపథ్యంలో తిరిగి టికెట్ ఇచ్చేది లేదని సీఎం జగన్ తేల్చి చెప్పిన విసం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత కూడా మాగుంటకు టికెట్ ఇప్పించేందుకు బాలినేని ప్రయత్నాలు చేశారు కానీ.. అవి ఫలించలేదు. ఆ తర్వాత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరును ఒంగోలు ఎంపీ స్థానానికి పార్టీ నేతలు ప్రతిపాదించారు. బాలినేనితో సహా జిల్లా నేతలంతా చెవిరెడ్డి పేరును వ్యతిరేకించడంతో ఆయన కూడా రేసు నుంచి ఔట్ అయ్యారు.
తండ్రీ కొడుకులకు ఇద్దరికీ టికెట్లు ఇచ్చే విధానం లేదన్నారనే విషయాన్ని విజయసాయిరెడ్డి, సజ్జలతో బాలినేని మాట్లాడారు. అలా ఇస్తే తన కుమారుడు ప్రణీత్‌రెడ్డికి కూడా ఇవ్వాలని అన్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం ఒంగోలులో మాగుంటతో బాలినేని, దర్శి ఇంచార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భేటీ అయ్యారు. లోక్‌సభ పరిధిలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన నేతలు సీఎంను కలిసి మాగుంటకు టికెట్ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరాలన్న ఆలోచన చేసినట్లు సమాచారం. ఈ బృందానికి నాయకత్వం ఎవరు వహిస్తారన్న విషయంలో మీమాంస తలెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి శనివారం బాలినేని, మంత్రి సురేశ్‌తో పాటు ఇతర నేతలతో మాట్లాడి రోజా పేరును ప్రతిపాదించినట్లు తతెలుస్తోంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా రోజాను దాదాపు ఖరారు చేయొచ్చని చెప్పారట. అంతేకాదు..ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ రానుందని తెలుస్తోంది.