విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతాం: మంత్రి లోకేశ్
ఏపీలో విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ గుడ్‌న్యూస్ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 27 July 2024 10:05 AM ISTవిద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతాం: మంత్రి లోకేశ్
ఏపీలో విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఈ విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని అన్నారు. విద్యార్థులకు విద్యా కానుక కింద ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే స్కూల్, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కూడా కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం వ్యవహారంపై విమర్శలు చేసిన నారా లోకేశ్.. బ్యాగ్‌ల విషయంలో నాణ్యత పాటించలేదని చెప్పారు. కొద్ది రోజులకే చిరిగిపోయాయి అన్నారు. అయితే.. తమ ప్రభుత్వం నాణ్యతతో కూడిన వస్తువులను పంపిణీ చేస్తామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
గత వైసీపీ ప్రభుత్వం అన్నింటికీ రాజకీయ రంగులు పులిమిందని నారా లోకేశ్ ఆరోపించారు. బ్యాగ్‌లు, బెల్టులపై కూడా పార్టీ రంగులు వేసుకున్నారని చెప్పారు. కానీ.. తాము అలా చేయబోము అన్నారు. విద్యాకానుక కిట్లపై పార్టీ రంగులు ఉండొద్దని అన్నారు. యూనిఫాం కూడా ఏ రంగులు ఉంటే బాగుంటుందనేది పరిశీలించాలని అధికారులతో చెప్పినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. గత ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యాకానుక కింద అందించే కిట్లను టెండర్లు లేకుండా కొనుగోలు చేసిందన్నారు మంత్రి నారా లోకేశ్.
మంత్రి లోకేష్ తల్లికి వందనం కార్యకక్రమంపైనా స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఈ పథకంపై ప్రభుత్వం తరఫున ప్రకటన చేశామని.. అయినా కొందరు దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తాము ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.