రుషికొండ ప్యాలెస్‌కు బదులు.. రెండేళ్లు పేదలకు భోజనం పెట్టేవారు: లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తోంది.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 10:07 AM ISTరుషికొండ ప్యాలెస్‌కు బదులు.. రెండేళ్లు పేదలకు భోజనం పెట్టేవారు: లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తోంది. ఆగస్టు పదిహేను నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. శుక్రవారం మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి మండలం నులకపేటలో మంత్రి నారా లోకేశ్ అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ స్వయంగా పలువురికి అల్పాహారం వడ్డించారు. సీఎం చంద్రబాబు నాయుడు గుడివాడలో గురువారం అన్న క్యాంటిన్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా వంద అన్న క్యాంటీన్ లను ప్రారంభించే క్రమంలో భాగంగా ఇవాళ 99 అన్న క్యాంటీన్ లు ప్రారంభం కానున్నాయి. వీటిని మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ సీనియర్ నేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నారు.
అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సందర్భంగా.. మంత్రి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని నారా లోకేశ్ విమర్శించారు. విశాఖ పట్నం రుషికొండలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారని నారా లోకేశ్ అన్నారు. 200 కోట్ల రూపాయలు ఏడాదికి అన్నా క్యాంటీన్లను నడిపించేందుకు అవసరం పడుతుంది. రుషికొండలో పెట్టిన డబ్బులతో రెండున్నరేళ్ల పాటు పేదలకు కడుపునిండా భోజనం పెట్టేవారని అన్నారు. ప్రజలందరూ ఇలాంటి విషయాలను గమనించాల్సిన అవసరం ఉందని నారా లోకేశ్ అన్నారు. నిరుపేద కుటుంబాల గురించే తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు. వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే పేద వారి పట్ల అనుచితంగా మాట్లాడటం బాధగా ఉందని అన్నారు. మూడు పూటలా పేదలకు అన్నం పెట్టలేని వారికి పేదల గురించి మాట్లాడే హక్కు లేదంటూ మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh: తాడేపల్లి నులకపేటలో అన్న క్యాంటీన్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడ ప్రజలకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. pic.twitter.com/cBaHw7ncQ7
— Newsmeter Telugu (@NewsmeterTelugu) August 16, 2024
అన్న క్యాంటీన్ లలో కేవలం రూ.5లకే అల్పాహారం, భోజనం అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్ లను ప్రారంభించాలని తొలుత ప్రభుత్వం భావించింది. అయితే భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతగా వంద క్యాంటీన్ లను ప్రారంభిస్తున్నారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి దాతల నుండి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి.