20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేశ్

విజయవాడలో సీఐఐ సమావేశం నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  21 Sep 2024 9:45 AM GMT
20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేశ్

విజయవాడలో సీఐఐ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు. ఇందు కోసం భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. ఏపీలో ఫుడ్‌ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయన్నారు. వేగంగా అనుమతులు, యూనిట్ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తోందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.

ఏపీలో నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్ గుడ్‌ న్యూస్ చెప్పారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక నెల రోజుల్లో ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే పెట్టుబడుల కోసం మీ వద్దకే మేం వస్తామనీ.. నైపుణ్యం ఉన్న మానవ వనరులు కూడా ఏపీలో సిద్ధంగా ఉన్నట్లు సీఐఐ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ చెప్పారు. అయితే.. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో శాశ్వతంగా ఎకో సిస్టం ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. అప్పుడే పెట్టుబడులు కూడా సుస్థిరంగా వస్తాయన్నారు.

గత ప్రభుత్వ హయాంలో సంప్రదాయేతర విద్యుత్ పీపీఏలు రద్దు అయ్యాయని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఇది ఏపీకే కాదు యావత్ భారత దేశంపైనా ప్రభావం చూపిందని విమర్శించారు. పెట్టుబడులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు తమ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోందన్నారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

Next Story