ఏపీలో వందరోజుల్లో గంజాయి విక్రయాలకు చెక్ పెడతాం: మంత్రి లోకేశ్
మంగళగిరి నియోజవకర్గంలో బక్రీద్ సందర్భంగా ఈద్గాలో ముస్లింలతో కలిసి మంత్రి నారా లోకేశ్ ప్రార్థనాల్లో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 17 Jun 2024 2:00 PM IST
ఏపీలో వందరోజుల్లో గంజాయి విక్రయాలకు చెక్ పెడతాం: మంత్రి లోకేశ్
మంగళగిరి నియోజవకర్గంలో బక్రీద్ సందర్భంగా ఈద్గాలో ముస్లింలతో కలిసి మంత్రి నారా లోకేశ్ ప్రార్థనాల్లో పాల్గొన్నారు. బక్రీద్ సందర్భంగా ముస్లింలకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇక ప్రజా దర్బార్‌ను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే అంశంపై పరిశీలన చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ముగ్గురు టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు హత్య చేశారనీ.. అయినా తాము సంయమనం పాటిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని సీఎం చంద్రబాబు చెప్పారనీ.. ఆయన ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని చెప్పారు. తమ కార్యకర్తలకు ఆగ్రహం వస్తే వైసీపీ వారు ఎక్కడుంటారో తెలుసుకోవాలని అన్నార. ప్రజలే ఎన్నికల్లో వైసీపీని తిరస్కరించారనీ.. ఇకనైన గూండా, హత్య రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. ఇక రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో ఇంకా బయటకు రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
కాగా.. మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలో ప్రజల కోసం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. రెండ్రోజులుగా ప్రజలు తమ సమస్యలను లోకేశ్ దృష్టికి తెస్తూనే ఉన్నారు. సోమవారం కూడా ప్రజలు ఉండవల్లిలోని నారా లోకేశ్ నివాసానికి వచ్చి వినతిపత్రాలను సమర్పించారు.