జగన్ మతం కౄరత్వమే: ఏపీ మంత్రి అనగాని ప్రసాద్
ఏపీలో రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి.
By Srikanth Gundamalla Published on 30 Sept 2024 4:08 PM IST
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశం తర్వాత ఏపీలో రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. వైసీపీపై అధికార పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే రేంజ్‌లో ప్రభుత్వ ప్రజాప్రతినిదులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మాజీ సీఎం జగన్‌పై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రవిమర్శలు చేశారు. దేశాన్ని, మతాన్ని కించపరిచేలా మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
ఎన్టీఆర్ భవన్‌లో వంద రోజుల పాలన-అభివృద్ధి సంక్షేమాల పేరిట ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భక్తుల మనోభావాలను గౌరవించి మాజీ సీఎం జగన్‌ను డిక్లరేషన్‌ను ఇవ్వాలని కోరితే.. హిందూయిజంపైనే ఏకంగా దాడి చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. తన మతం మానవత్వం అని చెప్పుకుంటున్నారనీ అన్నారు. జగన్ మతం మానవత్వం కాదనీ.. ఆయన మతం కౄరత్వమే అని విమర్శలు చేశారు. కల్తీ లడ్డూ వ్యవహారంలో జరిగిన తప్పు ఒప్పుకోలేక, క్షమాపణ చెప్పలేక వంకర మాటలు మాట్లాడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
అలాగే త్వరలోనే రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రీసర్వే సమస్యల పరిష్కారంపై మళ్లీ దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది వరద నష్టంలో నిమగ్నమై ఉందని చెప్పారు. అందుకే రీసర్వే సమస్యల పరిష్కారానికి కొంత గ్యాప్ వచ్చిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.