కడప లోక్‌సభ బరిలో షర్మిల, 114 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు ఏపీలో పలు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

By Srikanth Gundamalla  Published on  2 April 2024 3:53 PM IST
andhra pradesh, lok sabha, assembly, election, sharmila, kadapa,

కడప లోక్‌సభ బరిలో షర్మిల, 114 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీచేస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా అభ్యర్థులను ప్రకటించాయి. మరోవైపు అధికార పార్టీ వైసీపీ కూడా ఎన్నికల అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌ ఒక్కటే అభ్యర్థులను వెల్లడించడంలో ఆలస్యం చేసింది. ఇక తాజాగా కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు ఏపీలో పలు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్నాక.. ఆమె ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే కడప నుంచి బరిలో ఉంటారని వార్తలు వచ్చాయి. షర్మిల కూడా దీనిపై కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకుంటానని చెప్పారు. అయితే.. ఏఐసీసీ షర్మిలను లోక్‌సభ బరిలో నిలిపింది. కడప లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది. కడపతో పాటు మరో నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.

కాకినాడ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పల్లం రాజు పోటీ చేయనున్నారు. రాజమండ్రి నుంచి గిడుగు రుద్రంరాజు, బాపట్ల లోక్‌సభ నుంచి జేడీ శీలం పోటీ చేస్తుండగా.. కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి రాంపుల్లయ్య యాదవ్‌ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్ అధిష్టానం లిస్ట్‌ను షేర్‌ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కూడా కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటిచింది. ప్రస్తుతం తొలి జాబితాలో 114 అసెంబ్లీ స్థానాలకు ఏఐసీసీ అభ్యర్థులను వెల్లడించింది. కాగా.. ఇటీవల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి హస్తం పార్టీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా కాంగ్రెస్‌ టికెట్ కేటాయించింది. ఎలిజాకు చింతలపూడి టికెట్‌ ఇవ్వగా.. ఆర్థర్‌కు నందికొట్కూరు నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించింది.

Next Story