రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు: లగడపాటి రాజగోపాల్
రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 8 Jan 2024 7:15 PM ISTరాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు: లగడపాటి రాజగోపాల్
రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ హర్షకుమార్‌ను కలిసిన ఆయన.. ఈ కామెంట్స్ చేశారు. మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్‌లతో లగడపాటి రాజగోపాల్ సమావేశం అయ్యారు. ఈ ముగ్గురు మాజీ ఎంపీల సమావేశంతో ఏపీ రాజకీయాల్లో ప్రధాన్యత సంతరించుకుంది. 2014కి ముందు ఈ ముగ్గురు రాజకీయ ప్రముఖులు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ముగ్గురూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
కాగా.. సమావేశం అనంతరం లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిందని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని చెప్పాననీ.. అలాగే 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. అయితే.. రాజమహేంద్రవరానికి తాను ఎప్పుడు వచ్చినా ఉండవల్లి, హర్షకుమార్‌లను కలుస్తుంటానని క్లారిటీ ఇచ్చారు. అయితే.. తాను రాజకీయాల్లో తిరిగి వచ్చే ప్రసక్తే లేదన్నారు లగడపాటి రాజగోపాల్.
ప్రజల కోసం భవిష్యత్‌ను లెక్కచేయకుండా కాంగ్రెస్‌ను విడిచిపెట్టామని ఆయన అన్నారు. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో తాము పూర్తిగా విభేదించామన్నారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదన్నారు. అయితే.. ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్ ఎక్కడ పోటీ చేసినా మద్దతు ఇస్తానని ఈ సందర్భంగా చెప్పారు. అవసరం అయితే వారి తరఫున తాను ప్రచారంలో కూడా పాల్గొంటానని అన్నారు. గతంలో జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉండేది కానీ.. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యే పోటీ విపరీతంగా ఉంటోందని అన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తనకు సంతోషంగా ఉందని లగడపాటి రాజగోపాల్ అన్నారు.