ప్రభుత్వానివి అసత్య ప్రచారాలని నిరూపిస్తాం: మాజీ సీఎం జగన్
దైవ దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 27 Sep 2024 11:23 AM GMTదైవ దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని అన్నారు. తిరుమల పర్యటన రద్దు తర్వాత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
తిరుమల పర్యటనకు అనుమతి లేదని మా పార్టీ నేతలకు నోటీసులు ఇస్తున్నారని జగన్ అన్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ శ్రేణులను రప్పిస్తున్నారని అన్నారు. లడ్డూల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిక్లరేషన్ అంశాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. తిరుమల లడ్డూ గురించి టీడీపీ ప్రభుత్వం చెప్పేవన్నీ నిజాలు కావని తెలుస్తోందనీ.. రుజువులు కూడా ఉన్నాయని అన్నారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అసత్యాలు చెప్పడం దేనికి సంకేతమన్నారు జగన్. తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయం చేయడం ఇకనైనా మానుకోవాలని మాజీ సీఎం జగన్ సూచించారు.
కూటమి ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తోందని నిరూపిస్తామని జగన్ అన్నారు. టీటీడీలో 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలవడం దశాబ్దాలుగా జరుగుతున్నదే అని జగన్ అన్నారు. తక్కువ రేటుకు కోట్ చేసిన వారికి టీటీడీ టెండర్ ఖరారు చేస్తుందనీ.. దశాబ్దాలుగా జరుగుతున్న కార్యక్రమాన్ని వివాదాస్పదం చేస్తున్నారని అన్నారు. మరోవైపు క్వాలిటీ చెక్ చేయించాకే వాహనాలు తిరుమలకు వస్తాయన్నారు. కల్తీ ప్రసాదాలను భక్తులు తిన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ అన్నారు.