Andhra Pradesh: సహాయక చర్యలకు జిల్లాకు రూ.3కోట్లు.. వారికి రూ.5లక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల వరదలు సంభవిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 1 Sept 2024 9:45 AM ISTఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల వరదలు సంభవిస్తున్నాయి. దాంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సహాయక చర్యల కోసం సీఎం చంద్రబాబు నిధులను తక్షణ సాయం కింద విడుదలచేయాలన్నారు. జిల్లాకు రూ.3 కోట్లు విడుదల చేయాలన్నారు. అలాగే..వరద ప్రభావం తక్కువ ఉన్న జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున సాయం విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే. .వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోతే అలాంటి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. శ్రీకాకుళం- విశాఖ మధ్య తుఫాను తీరం దాటనుందని, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి తీరగ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు.. పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలకు ఏ సమయంలో సహాయం కావాల్సి వచ్చినా.. వెంటనే రంగంలోకి దిగాలని సూచించారు. హుద్‌హుద్ సమయంలో అనుసరించిన విధానం ప్రస్తుతం పాటించాలని అధికారులకు సూచించారు. నష్టం జరిగిన తర్వాత కాకుండా.. ఆ నష్టాన్ని తగ్గించేలా అధికారుల పనితీరు ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రాణనష్టం జరగకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. నాలాలు తెరిచి ఉన్నచోట హెచ్చరికలు ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు వద్ద వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఉపాధ్యాయుడు, విద్యార్థులు చనిపోయిన ఘటనపై వివరణ ఇవ్వాలని చెప్పారు. భారీ వర్షాలు పడుతున్నా సెలవులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం మేరకు సెలవు విషయంపై ఒక రోజు ముందే ప్రకటన చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. వరద ప్రవాహాలు ఎక్కువగా ఉన్న చోట్ల ప్రజలు వాటిని దాటకుండా నియంత్రించాలన్నారు. అధికారులు వాట్సాప్ గ్రూపుల ద్వారా సమన్వయం చేసుకుంటూ పని చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.