ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఉద్యోగాల్లోనూ 'ఈడబ్ల్యూఎస్‌' రిజర్వేషన్లు

Andhra Pradesh govt to implement EWS quota in govt jobs.ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2021 8:07 AM IST
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఉద్యోగాల్లోనూ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు విద్యా సంస్థలతో పాటు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు విద్యావకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 జూలై 27న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దానికి కొనసాగింపుగా ఉద్యోగావకాశాల్లోనూ 10% రిజర్వేషన్లు కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నిబంధ‌న‌ల్లోనూ భారీ మిన‌హాయింపుల‌నిచ్చింది. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉండాలన్న ఒక్క నిబంధన మాత్రమే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మిగతా అర్హత నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించింది.

- ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్‌ కేటగిరీలలోకి రాని వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఈ రిజర్వేషన్లకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం గరిష్టంగా రూ.8 లక్షల లోపు ఉండాలి.

- ఈడబ్ల్యూఎస్‌ కింద ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రోస్టర్‌ పాయింట్లను తర్వాత ప్రత్యేకంగా నిర్ణయిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

- ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ కింద కల్పించే పది శాతం రిజర్వేషన్లలో మూడో వంతు ఆ వర్గాలకు చెందిన మహిళలకు కేటాయిస్తారు. అర్హులైన వారికి ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్లకు కల్పించారు.

కేంద్ర నిబంధనలు ఇవీ..

కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు వీలు కల్పిస్తూ చట్టం చేసినప్పుడు అందుకు కొన్ని అర్హత నిబంధనలు పొందుపరిచింది. దాని ప్రకారం..

- కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉన్నవారే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు అర్హులు.

- కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉన్నప్పటికీ.. ఆ కుటుంబానికి 5 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నా, 1000 చ.అడుగులు, అంతకు మించిన వైశాల్యం కలిగిన ఫ్లాట్‌ ఉన్నా, ఏదైనా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌ పరిధిలో 100 చ.గజాలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం గల స్థలం ఉన్నా, ఇతర ప్రాంతాల్లో 200 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలం ఉన్నా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు అర్హులు కాదని స్పష్టం చేసింది.

- ఆ కుటుంబ ఆస్తులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా కూడా అవన్నీ కలిపే లెక్కిస్తారని తేల్చిచెప్పింది.

- కుటుంబ వార్షికాదాయాన్ని లెక్కించేటప్పుడు.. రిజర్వేషన్‌ కోరుతున్న వ్యక్తితో పాటు, వారి తల్లిదండ్రులు, భార్య/భర్త, 18 ఏళ్ల లోపు వయసున్న సోదరులు, పిల్లల ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారని తెలిపింది.

Next Story