స్థానిక సంస్థలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 20 Aug 2024 6:28 PM IST
స్థానిక సంస్థలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలకు గుడ్‌న్యూస్ చెప్పింది. స్థానిక సంస్థల కోసం భారీగా నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు స్థానిక సంస్తల కోసం రూ.1452 కోట్లను విడుదల చేశారు. గ్రామపరిధిలోని స్థానిక సంస్థలకు రూ.998 కోట్లు, పట్టణ పరిధిలోని స్థానిక సంస్థలకు రూ.454 కోట్లు చొప్పున ఆర్థిక శాఖ కేటాయించింది. గత వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిన 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేసిన సందర్భంగా మంత్రి పయ్యావు కేశవ్ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమైనట్లు చెప్పారు. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నిధుల ద్వారా స్థానిక సంస్థలకు ఆర్థికంగా వెసులుబాటు కలగనుందని పయ్యావు తెలిపారు. అలాగే గ్రామాల అభివృద్ధితోనే ప్రగతి సాధ్యమన్న బాపూజీ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన ఉంటుందని మంత్రి పయ్యావుల చెప్పారు.