ఏపీలో నిరుద్యోగులకు త్వరలోనే నెలకు రూ.3వేలు!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
By Srikanth Gundamalla Published on 15 July 2024 2:43 AM GMTఏపీలో నిరుద్యోగులకు త్వరలోనే నెలకు రూ.3వేలు!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోంది. ఇప్పటి పెన్షన్ల పెంపు, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ రద్దు, సహా మరిన్ని హామీలను అమలు చేస్తోంది. అలాగే విద్యార్థులకు అందించే తల్లికి వందనం, ఆడబిడ్డకు నిధి కార్యక్రమాలపై కసరత్తు చేస్తోంది. తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. నిరుద్యోగులు, యువతకు గుడ్‌న్యూస్ అందనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పథకానికి అర్హులైన వారు ఏఏ డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోవాలనే దానిపై ప్రచారం జరుగుతోంది.
కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పాయి. ఈ క్రమంలోనే నిరుద్యోగ భృతి అందించేందుకు కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అర్హతలు, ఏ డాక్యుమెంట్లు కావాలి.? దరఖాస్తుల వివరాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే పథకం అమలు కాబోతుందని.. అర్హులైన వారు డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు ప్రభుత్వం ఓ వెబ్‌సైట్‌ను కూడా రూపొందించినట్లు సమాచారం. ఈ పథకం కింద, అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందిస్తారని చెబుతున్నారు.
22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారికి అర్హులని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా ఉండాలి. కనీసం ఇంటర్మీడియట్, డిప్లొమా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివి ఉండాలని ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థికి ఇతర మార్గాల్లో నలకు రూ.10వేలు కన్న ఎక్కువ ఆదాయం ఉండకూడదు. అలాగే పట్టణ ప్రాంతంలో 1500 చదరపు అడుగుల స్థలం, గ్రామీణ ప్రాంతంలో 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి మాత్రమే ఉండాలి. సదరు అభ్యర్థి, కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్ పొందకూడదు. బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ కాపీ, బీపీఎల్ రేషన్ కార్డు, కుటుంబ ఆదాయ సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. AP Yuva Nestham వెబ్‌సైట్ మరిన్ని వివరాలకు సంప్రదించాలని చెబుతున్నారు. కానీ.. ఈ వెబ్‌సైట్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. త్వరలోనే ఈ పథకం ప్రారంభం అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.