పెన్షన్‌ తీసుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  29 Aug 2024 6:31 AM IST
andhra Pradesh, govt, pensioners, good news,

పెన్షన్‌ తీసుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ 

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పథకాలను మళ్లీ పునఃప్రారంభిస్తోంది. పెన్షన్ల విషయంలో తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం రూ.4వేలకు పెంచి పెన్షన్ అందిస్తోంది. పెన్షన్ల పంపిణీ విషయంలో సర్కార్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. పెన్షన్లు పెంపు ఇప్పటికే అమలు చేస్తే.. సమయానికి లబ్ధిదారులకు డబ్బులు అందేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ దారులకు డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటుంది. సెప్టెంబర్‌ నెల పెన్షన్ మాత్రం ఒక రోజు ముందుగానే అర్హులకు అందించనుంది. అంటే ఆగస్టు 31వ తేదీన పెన్షన్ దారులకు డబ్బులు అందించనుంది ప్రభుత్వం. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లను అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. సెప్టెంబర్‌ ఒకటో తేదీన ఆదివారం సెలవు రోజు కావడంతో ఒక రోజు ముందుగానే ఆగస్టు 31వ తేదీన పెన్షన్లను అందించనున్నారు. ఏదైనా కారణం చేత లబ్ధిదారులకు పెన్షన్‌ 31వ తేదీన అందకపోతే మాత్రం.. సెప్టెంబర్‌ రెండో తేదీన అందించనున్నట్లు చెప్పింది. గత ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్లు అందిస్తే.. కూటమి ప్రభుత్వం మాత్రం సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే ఇంటింటికీ పెన్షన్లను అందిస్తోంది.

Next Story