యువత కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 7:25 AM ISTయువత కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే పలు కీలక హామీలను అమలు చేసింది. మరికొన్నింటిని అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. యువతకు సంబంధించి ఈ కొత్త కార్యక్రమాన్ని తీసుకురాబోతుంది. రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే యువతకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఈడీపీ) అనే కొత్త కార్యక్రమం ప్రారంభించాలనే ఆలోచన చేస్తోంది. ఈ మేరకు అధికారులు ప్రణాళికలను రెడీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, కాపు యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి.
ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ (జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ)తో ఒప్పందం చేసుకోనుంది. ఇప్పటికే ఆ సంస్థతో ఆయాశాఖల అధికారులు చర్చలు కూడా ప్రారంభించారు. పరిశ్రమల సిలబస్‌కు అనుగుణంగా 4 లేదా 6 వారాలు శిక్షణ అందిస్తారు.ఒక్కో అభ్యర్థిపై అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి భరించనుంది. అంతేకాదు ఏటా 2వేల మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. ఇందులో పెద్దపీట బీసీలకు వేయనున్నట్లు తెలుస్తోంది. వెయ్యి మంది బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 500 మంది, కాపు సామాజిక వర్గం నుంచి 500 మందిని ఈ కార్యక్రమంలోకి తీసుకోనున్నారు. ఏడాది మొత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తం ఐదేళ్లలో 9 వేల మంది యువతను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలను రెడీచేసుకుంది. ఎన్‌ఐఎంఎస్‌ఎంఈలో శిక్షణ తర్వాత వారి ఆసక్తికి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకూ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది.