ఏపీలో మద్యం ధరలను పెంచేసిన ప్రభుత్వం
ఏపీలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం చేదువార్త వినిపించింది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 8:08 AM IST
ఏపీలో మద్యం ధరలను పెంచేసిన ప్రభుత్వం
ఏపీలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం చేదువార్త వినిపించింది. ఆంధ్ర ప్రదేశ్‌లో వివిధ మద్యం బ్రాండ్లపై వాటి ఎమ్మార్పీ ఆధారంగా ఫిక్స్‌డ్ కాంపొనెంట్ రూపంలో ప్రస్తుతం విధిస్తున్న ఏఆర్‌ఈటీ ఇకపైన ఆయా బ్రాండ్ల ధరపై శాతాల రూపంలో వసూలు ఉంటుంది.. వ్యాట్, ఏఈడీనీ సవరించింది. ఈ సవరణల వల్ల అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ఒకే తరహాలో పన్నుల భారం పడనుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా నిర్ణయంతో మద్యం బాటిళ్లపై ధరలు పెరగనున్నాయి. కొన్ని బ్రాండ్ల మద్యం ధరలు క్వార్టర్ సీసా ధర రూ.10 నుంచి రూ.40 వరకు పెరగనుంది. హాఫ్ బాటిల్ ధర అయితే రూ.10-50 వరకు, ఫుల్ బాటిల్ రూ.10-90 వరకు పెరగనున్నాయి. మరికొన్ని బ్రాండ్ల ధరలు తగ్గగా.. ఎక్కువగా అమ్ముడుపోయే బ్రాండ్ల ధరలే పెరిగాయి. అధికంగా అమ్ముడుపోనివి, అందుబాటులోని బ్రాండ్ల ధరలు తగ్గాయి. ఐఎంఎఫ్‌ఎల్ కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం, బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం, ఫారిన్ లిక్కర్‌పై 75 శాతం ఏఆర్‌ఈటీ ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు. ఒక బ్రాండ్ ఫుల్ బాటిల్ ప్రస్తుతం రూ.570 ఉంటే.. అది రూ.590కి పెరిగింది. మరో బ్రాండ్ క్వార్టర్ రూ.200 నుంచి రూ.210కి చేరింది. 1365 రకాల మద్యం బాటిళ్ల ధరలలో 10 నుంచి 90 రూపాయలు వరకూ ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. మరోవైపు.. కొన్ని ప్రీమియం బ్రాండ్ల ధరలు మాత్రం భారీగా పెరిగాయి. ఈ అదనపు ధర నవంబర్ 18వ తేదీ నుంచే అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
2024లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో మద్యంపై భారీ ఆదాయమే లక్ష్యంగా జగన్ ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. వైసీపీ శ్రేణులు మాత్రం ఇదంతా మద్యం నియంత్రణలో భాగమేనని చెబుతన్నారు.