సర్కార్ లిక్కర్ షాపులను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 26 Sept 2024 9:00 PM ISTఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వ హయాంలో మద్యం షాపులు నడుస్తున్న విషయం తెలిసిందే. వాటిని రద్దు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు. ఈ విధానాన్ని మారుస్తూ తాజాగా కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది.
కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త లిక్కర్ పాలసీ రాబోతుంది. ఇటీవల కొత్త లిక్కర్ పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో టీడీపీ హయాంలో 2014-19 వరకు ఉన్న మళ్లీ పాత విధానంలో మద్యం దుకాణాల్లో లిక్కల్ విక్రయాలు జరుగుతాయి. మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రయివేట్‌కు అప్పగించనున్నారు. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ ద్వారా మద్యం షాపులను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,396 వైన్ షాప్ లను నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు పది శాతం దుకాణాలు కేటాయిస్తారు. మరో 396 దుకాణాలను అదనంగా నోటిఫై చేయనున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో మద్యం ధరలు కూడా తగ్గించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది