ఏపీలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగించిన ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు గడువు తేదీని పొడిగించింది.
By Srikanth Gundamalla Published on 1 Dec 2023 11:06 AM GMTఏపీలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగించిన ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు గడువు తేదీని పొడిగించింది. డిసెంబర్ 5వ తేదీ వరకు ఫీజు గడువుని పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ విద్యార్థులు ఇంకా ఎవరైనా ఫీజు కట్టని వారు ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈమేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ప్రకటన చేశారు.
ఏపీలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీ నవంబర్ 30వ తేదీనే ముగిసింది. అయితే.. తాజాగా ఆ తేదీని పొడగించింది ఏపీ ప్రభుత్వం. మరో ఐదు రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు నుంచి ప్రకటన వెలువడింది. డిసెంబర్ 5 తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండానే ఎగ్జామ్ ఫీజులు చెల్లించుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. అయితే.. ఈ అవకాశం రెగ్యులర్, ప్రయివేట్ ఇంటర్ జనరల్, ఒకేషనల్ గ్రూపుల విద్యార్థులందరికీ వర్తిస్తుందని చెప్పారు సౌరభ్.
డిసెంబర్ 5వ తేదీ తర్వాత ఆలస్య రుసుములతో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.1000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 15వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజులు చెల్లించుకోవచ్చని ఆయన తెలిపారు. రుసుము లేకుండా ఫీజు కట్టుకోవాలంటే మాత్రం డిసెంబర్ 5లోపే చెల్లించాలని సూచించారు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు 2024 మార్చిలో జరగనున్నాయి.