Andhra Pradesh: త్వరలోనే రైతుల అకౌంట్లలోకి డబ్బులు
ఏపీ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తుందని చెప్పింది.
By Srikanth Gundamalla Published on 26 July 2024 7:30 AM ISTAndhra Pradesh: త్వరలోనే రైతుల అకౌంట్లలోకి డబ్బులు
ఏపీ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తుందని చెప్పింది. ధాన్యం సేకరణకు సంబందించిన మిగిలిన రూ.674 కోట్ల బకాయిలను పది రోజుల్లోగా రైతుల అకౌంట్లలో జమ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టంగా చెప్పారు. రైతుల బకాయిలు చెల్లించడాన్నే ప్రాధాన్య అంశంగా తీసుకున్నామని ఆయన అన్నారు. పెరిగిన నిత్యావసర వస్తుల ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోదని నాదెండ్ల మనోహర్ చెప్పారు. రైతు బజార్ల ద్వారా కందిపప్పు, బియ్యాన్ని రాయితీపై ప్రజలకు అందిస్తున్నామని ఆయన చెప్పారు.
చౌక ధరల దుకాణాల ద్వారా ఇచ్చే సరకులను నాసిరకంగా ఇవ్వడం లేదన్నారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నాదెండ్ల అన్నాఉ. నాణ్యంగా వస్తువులను ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. 251 స్టాక్ పాయింట్లను తనిఖీ చేసి నాణ్యత కల్గిన వస్తువులనే ఇవ్వాలని ఆదేశించామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నాణ్యత లేకుండా వస్తువులను పంపిణీ చేసిన 19సంస్థలపై చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా ఎవరైనా ఇలాంటి వారు ఉంటే కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్.
మరోవైపు గత వైసీపీ ప్రభుత్వంపైనా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించి రూ.2,763 కోట్లు బకాయిలు పెట్టిందని ఆరోపించారు. ధాన్యం సేకరణ పేరిట సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి గత ప్రభుత్వం 39,550 కోట్ల రూపాయల అప్పులు చేసిందన్నారు. రుణాలు తెచ్చిన జగన్ ప్రభుత్వం రైతుల బకాయిలు మాత్రం చెల్లించలేదని.. ఆ డబ్బులను ఏం చేశారంటూ నిలదీశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు రూ.2వేల కోట్ల బకాయిలు చెల్లించామని మంత్రి నాదెండ్ల చెప్పారు. మిగిలిన బకాయిలు పదిరోజుల్లో జమ చేస్తామన్నారు.