ఏపీలో వారందరికీ రూ.10వేలు.. రూ.25 కోట్లతో ఆరోగ్యబీమా అమలుకి సిద్ధం!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 12 Sept 2024 7:04 AM ISTఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా మరో పథకం అమలు చేయడానికి సన్నద్ధం అవుతోంది. ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల ఆరోగ్య బీమాకు కట్టుబడి ఉంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.25 కోట్లతో చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇటీవల జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కూడా త్వరలోనే ఆరోగ్య బీమాను అమలు తెస్తామని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు బీమాకు సంబంధించి చేనేత, జౌళి శాఖ అధికారులు బీమా కంపెనీలతో సమావేశం కూడా నిర్వహించారు.
ఐసీఐసీఐ లాంబార్డ్ బీమాసంస్థ బీమాకు సంబంధించి ప్రతిపాదనల్ని అందించింది. ఏపీ వ్యాప్తంగా ఏడాదికి ఒక్కో కుటుంబంపై రూ.2,100 ప్రీమియం చెల్లిస్తే పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వానికి వారు తెలిపారు. ఈ ప్రతిపాదల్ని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. బీమాకు సంబంధించి ఒక్కో కుటుంబం చెల్లించాల్సిన రూ.2,100 ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికుల తరఫున ప్రభుత్వమే బీమా కంపెనీలకు చెల్లిస్తుంది. చేనేత కార్మికులు రూపాయి కూడా చెల్లించకుండా ఆరోగ్య బీమాను పొందవచ్చు. నివేదికల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1.22 లక్షల చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరందరికీ ఏటా రూ.2,100 ప్రీమియం చెల్లిస్తే.. ఏడాదికి రూ.25.76 కోట్లు అవుతుందని అధికారులు చెప్పారు. ఇక ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే టెండర్లు పిలిచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇప్పుడు ఇచ్చిన హామీ మేరకు కుటుంబానికి ఏడాదికి రూ.10 వేల వరకు ఉచితంగా (క్యాష్‌లెస్) ఓపీడీ సేవలు అందించేలా ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఒక కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలకు ఈ బీమా వర్తించనుంది.