మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ సర్కార్ ముహూర్తం ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడ్డ కొత్త కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.
By Srikanth Gundamalla
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ సర్కార్ ముహూర్తం ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడ్డ కొత్త కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎం చంద్రబాబు బాద్యతలు తీసుకున్న వెంటనే పలు కీలక హామీలను అమలు చేసే ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆ తర్వాత ఆ దిశగా అడుగులు వేగంగా ముందుకు పడుతున్నాయి. ఇప్పటికే పెంచిన పెన్షన్లు, మెగా డీఎస్సీ, ఉచిత ఇసుక వంటి హామీలు అమలవుతున్నాయి. మరో కీలక హామీకి సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.
ఎన్నికల వేళ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితబస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే ఆ హామీని అమలు చేసేందుకు కృషి చేస్తోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా ఈ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 15వ తేదీన విశాఖ నుంచి ఈ పథకం ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అదే రోజున అన్న క్యాంటీన్లను కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
జూలై 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉచిత బస్సు పథకం అమలు దిశగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలోనూ ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ అవకాశం కల్పించాలనే దాని పైన అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు.