ఏపీలో అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగం

ఏపీలో అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. వీరి సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on  6 Jan 2024 8:45 AM GMT
andhra pradesh, govt, ESMA,  anganwadis, nara lokesh,

ఏపీలో అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగం

ఏపీలో అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. వీరి సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్‌వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం జీవో నెంబర్-2 విడుదల చేసింది ఏపీ సర్కార్. గడిచిన 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. సమ్మె కాలానికి సంబంధించి వేతనం కట్‌ చేసింది. నెలనెలా వర్కర్ల ఖాతాల్లో పడుతున్న రూ.10వేల వేతనం స్థానంలో ప్రభుత్వం ఈ నెల రూ.8,050 మాత్రమే జమ చేసింది.

ఎస్మా అంటే ది ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటనెన్స్ యాక్ట్. ప్రజల సాధారణ జీవనం సాఫీగా సాగేందుకు తోడ్పడే సర్వీసులకు భంగం కలగకుండా ఈ చట్టం ఉపయోగపడుతుంది. వైద్యం, ప్రజా రవాణా వంటి అత్యవసర సేవలు అందించే రంగాల్లో ఉండే సిబ్బంది సమ్మెల పేరుతో విధులకు గైర్హాజరు కాకుండా ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు.

కాగా.. అంగన్‌వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని నారా లోకేశ్‌ తప్పుబట్టారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మనే గెంటేసిన వ్యక్తికి అంగన్వాడీల విలువ ఏం తెలుసని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన చేయడం కూడా నేరమేనా అని లోకేశ్ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ చర్యలు నియంత పోకడలకు పరాకాష్టగా ఉన్నాయన్నారు. జీవో నెంబర్‌2ని వెంటనే ఉపసంహరించుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అంగన్‌వాడీల ఉద్యమానికి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తోందని ప్రకటించారు.

ఎస్మా చట్టాన్ని తమపై ప్రయోగించడాన్ని అంగన్‌వాడీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ బెదిరింపులకు తాము ఏమాత్రం భయపడబోమని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు తమ సమ్మె ఆగబోదని చెప్పారు.

Next Story