Andhra Pradesh: మొబైల్ రైతు బజార్లు.. ఇళ్ల వద్దకే ఇక కూరగాయలు
రైతు బజార్లను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.
By Srikanth Gundamalla
Andhra Pradesh: మొబైల్ రైతు బజార్లు.. ఇళ్ల వద్దకే ఇక కూరగాయలు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బజార్లను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. దాంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 100కి పైగా మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన నగరాల్లో ప్రారంభించనున్నట్లు రైతుబజార్ల సీఈవో శేఖర్‌బాబు శనివారం వెల్లడించారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కర్నూలు వంటి నగరాల్లో అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ, శివారు కాలనీల్లో ఉండే ప్రజలకు ఇళ్ల వద్దకే తీసుకెళ్లి కూరగాయాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
కాగా.. ప్రస్తుతం మొబైల్ రైతు బజార్లు గుంటూరు, విజయవాడలో కేవలం 16 మాత్రమే ఉన్నాయి. వీటికి అదనంగా మరో 100 మొబైల్ బజార్లను ప్రారంభిస్తున్నారు. రైతుబజార్లు సాలూరు, అనపర్తి, అంగర, రాయవరం, బాపట్ల, వేంపల్లి, ప్రొద్దుటూరు, పత్తికొండ, ఆళ్లగడ్డ, వెలుగోడు, ఆత్మకూరు, మదనపల్లిలో కొత్తగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వీటి నిర్మాణం కూడా పూర్తయిందని శేఖర్ బాబు వెల్లడించారు. ప్రతి మున్సిపల్ కేంద్రంలో రైతుబజార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నట్లు చెప్పారు. దళారి వ్యవస్థలకు చెక్ పెట్టాలనే లక్ష్యంగా రైతులే నేరుగా తమ ఉత్పత్తులను వినియోగదారులకు అందించేలా రైతు మొబైల్ బజార్లను తీసుకొచ్చింది ప్రభుత్వం. రైతులకు మేలు జరగడమే కాదు.. వినియోగదారులకు కూడా తక్కువ ధరలకు కూరగాయలు లభించనున్నాయి.