ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త.. నేడు అకౌంట్లలోకి డబ్బులు
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్. ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా పథకం నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు.
By అంజి Published on 23 Jan 2024 6:33 AM ISTఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త.. నేడు అకౌంట్లలోకి డబ్బులు
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్. ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా పథకం నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. 2019 ఏప్రిల్ 11 నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది పొదుపు మహిళల పేరుతో బ్యాంకుల్లో రూ.25,570.80 కోట్లు అప్పు ఉండగా.. అందులో ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లు వైసీపీ ప్రభుత్వం ఆయా మహిళలకు చెల్లించింది. మిగిలిన రూ.6,394.83 కోట్ల మొత్తాన్ని 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేస్తారు. చివరి నాలుగో విడతగా నేటి నుంచి నేరుగా వారికే చెల్లించబోతోంది. వైఎస్సార్ ఆసరా పథకం అర్హుల పేర్లను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచారు. ఒకవేళ ఏవైనా అనుమానాలు ఉంటే.. హెల్ప్‌లైన్ నంబర్- 0863-2347302 కాల్ చేసి లేదా ఇమెయిల్ ఐడి - supportmepma@apmepma.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ పథకం ద్వారా నాలుగు విడతల్లో నేరుగా డబ్బులు అందజేయడంతో పాటుగా, ఆ డబ్బులను మహిళలు దేనికైనా ఉపయోగించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దీనికి తోడు అదనంగా పెద్ద ఎత్తున బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో గత 56 నెలల కాలంలో వ్యాపారాలు బాగా పెరిగాయి. ఈ పథకం ద్వారా డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్నటువంటి రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది. అందుకు దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసిగా ఉండాలి . డ్వాక్రా గ్రూపులో సభ్యురాలై ఉండాలి.. ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, లోన్ డాక్యుమెంట్ ఉండాలి. నివాస రుజువు పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఒకవేళ అర్హత ఉండి కూడా అకౌంట్‌లో డబ్బులు జమకాకపోతే అధికారుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.