అమరావతి: సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. ప్రభుత్వ సేవలు ప్రజలందరికీ సులువుగా అందుబాటులో ఉండేలా వాట్సాప్ గవర్నెన్స్‌ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రభుత్వం సరికొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. డ్వాక్రా రుణాలు, పొదుపు డబ్బులు చెల్లించేందుకు ప్రతి నెలా మహిళలు బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు, స్వయం సహాయక సంఘాల రుణ చెల్లింపు సులభం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ సమస్యను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఓ యాప్ తీసుకురానుంది.
ఈ యాప్ ద్వారా రుణాలు పొదుపు డబ్బులు ఇంటి నుంచే చెల్లించవచ్చు. దీని వల్ల నగదు బదిలీ మోసాలు తగ్గడమే కాకుండా సభ్యుల సమయం కూడా ఆదా కానుంది. డ్వాక్రా రుణాల చెల్లింపు కోసం గ్రూప్ తరపున ప్రతి నెలా ఒకరు డబ్బులు వసూలు చేసి వాటిని బ్యాంకుల్లో జమ చేస్తుంటారు. ఒక వ్యక్తి పని మానుకుని.. రోజంతా దీని కోసమే సమయం కేటాయించాల్సి వస్తుంది. అయితే ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఆ ఇబ్బందులు తప్పుతాయి. ఇంటి నుంచే వాయిదాలు చెల్లించుకోవచ్చు. యాప్ వినియోగం వల్ల డిజిటల్ లావాదేవీలతో పారదర్శకత ఉంటుంది. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది మార్చి లోపు 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.61,964 కోట్ల రుణాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.