పాఠశాల విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం...
By - అంజి |
పాఠశాల విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ‘స్మార్ట్ కిచెన్’ అనే వినూత్న ప్రాజెక్టును చేపట్టింది. కడపలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఒక మోడల్ కిచెన్‌ను ప్రారంభించగా, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 155 స్మార్ట్ కిచెన్‌ల నిర్మాణానికి సమగ్రశిక్ష విభాగం ప్రణాళికలు సిద్ధం చేసింది. సుమారు 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే ప్రతి కిచెన్‌లో ఆధునిక వంట పాత్రలు, ఆర్‌వో ప్లాంట్లు, సోలార్ సిస్టమ్, సీసీ కెమెరాలు వంటి అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. తొలి దశలో ఈ 155 కిచెన్‌ల ద్వారా 6,107 పాఠశాలల్లోని సుమారు 5.31 లక్షల మంది విద్యార్థులకు వేడివేడి, నాణ్యమైన భోజనాన్ని అందించనున్నారు.
ఈ స్మార్ట్ కిచెన్‌లు క్లస్టర్ పద్ధతిలో పనిచేస్తాయి. అంటే సగటున ప్రతి 40 పాఠశాలలకు ఒక కిచెన్ చొప్పున ఏర్పాటు చేసి, అక్కడి నుండి 5 నుండి 10 కిలోమీటర్ల పరిధిలోని స్కూళ్లకు భోజనాన్ని వాహనాల ద్వారా సరఫరా చేస్తారు. దీనివల్ల వంట సమయంలో శ్రమ తగ్గడమే కాకుండా, ఇంధన పొదుపు సాధ్యమవుతుంది. భోజన తయారీలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో మంజూరు చేసిన 1,473 కిచెన్ కమ్ స్టోర్ల నిధులను ఈ ప్రాజెక్టుకు మళ్లించేలా రాష్ట్ర విద్యాశాఖ ప్రతిపాదించింది. దీనివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలను దశలవారీగా ఈ ప్రాజెక్టు కిందకు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా శ్రీకాకుళంలో 20, నెల్లూరులో 16, అనంతపురంలో 14 చొప్పున స్మార్ట్ కిచెన్‌లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న పాత వంట విధానం వల్ల ఎదురవుతున్న నాణ్యత లోపాలు, వృథా మరియు సమయపాలన సమస్యలకు ఈ స్మార్ట్ కిచెన్‌లు శాశ్వత పరిష్కారాన్ని చూపుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.