రాష్ట్రంలో మరో రీన్యూ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 6 గిగా వాట్స్ ఫోటోవోల్టాయిక్ ఇంగోట్-వేఫర్ తయారీ కర్మాగారం ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.3,700 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుకు రీన్యూ ఫోటోవోల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పరిశ్రమ ఏర్పాటుతో 1,200 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఆదేశాల్లో తెలిపింది.
సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు పనులు మార్చి 2026లో ప్రారంభించి, మార్చి 2028 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని ప్రభుత్వ ఆదేశించింది. అయితే కర్మాగారం ఏర్పాటుకు ఎకరం 66 లక్షల చొప్పున 135.96 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విద్యుత్ చార్జీ, నీటి పన్నులు , స్టాంపు డ్యూటీ కేటాయింపుల్లోనూ రాయితీలు కల్పించింది. ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పాలసీ 4.0 ప్రకారం పలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖలు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో తెలిపింది. ఈ మేరకు పరిశ్రమలు,వాణిజ్య శాఖ కార్యదర్శి వై యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.