ఏపీలోని ఈ జిల్లాలో నేడు కూడా స్కూళ్లకు సెలవు
ఏపీ వ్యాప్తంగా రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలతో వరద ముంచెత్తింది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2024 7:42 AM ISTఏపీ వ్యాప్తంగా రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలతో వరద ముంచెత్తింది. దాంతో చాలా ప్రాంతాలు వరద మయం అయ్యాయి. నాలుగు రోజుల నుంచి వరద ముంపు గ్రామాలు తేరుకోలేకపోతున్నాయి. విజయవాడ వంటి ప్రాంతాల్లో ఇంకా వరద నీరు చుట్టుముట్టి ఉండటంతో జనజీవనం స్తంభించి పోయింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు జిల్లా అధికారులు. వరుసగా ఐదోరోజు కూడా విద్యాసంస్థలు ఎన్టీఆర్ జిల్లాలో మూతపడనున్నాయి. అన్ని ప్రభుత్వ , ప్రయివేటు పాఠశాలలు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని చాలా స్కూళ్లను ఇప్పటికే పునరావాస కేంద్రాలుగా ప్రభుత్వ అధికారులు మార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్కూళ్లకు సెలవులు ఇచ్చారని తెలుస్తోంది.
మరోవైపు ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారుల సూచించారు. పశ్చిమ మధ్య బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఫలితంగా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడుకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 4 రోజుల క్రితం కురిసిన వర్షం నుంచి బెజవాడ నగరం ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే మరో అల్పపీడనం హెచ్చరికలు ఉండటంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.