స్పెషల్ సెక్యూరిటీని నియమించుకున్న మాజీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక ప్రయివేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు.
By Srikanth Gundamalla Published on 18 Jun 2024 8:04 AM ISTస్పెషల్ సెక్యూరిటీని నియమించుకున్న మాజీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక ప్రయివేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. ఒక ప్రయివేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా 30 మందిని సిబ్బందిని తాడేపల్లిలోని ఆయన నివాసానికి రప్పించుకున్నారు. సోమవారం ఒకేసారిగా సఫారీ సూట్లలో భరతమాత్ర విగ్రహం కూడలి వద్ద సెక్యూరిటీ సిబ్బంది కనిపంచారు. దాంతో.. అక్కడ కాస్త హడావుడి కనిపించింది. ఇక కాసేపటికే జగన్ క్యాంపు కార్యాలయం నుంచి వారికి అనుమతి రావడంతో వారంతా లోపలికి వెళ్లారు.
గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో, పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ప్రయివేట్ భద్రతా సిబ్బందిని నియమించుకున్నారు జగన్. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైంది. అధికారాన్ని చేజార్చుకోవడమే కాదు.. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. 30 మంది వరకు ప్రయివేట్ సిబ్బందిని జగన్ సెక్యూరిటీగా ఏర్పరుచుకున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఇంతే మొత్తంలో సెక్యూరిటీ ఉంటుంది.
జగన్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటుపై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తన ఇంటి ముందుకు మీడియా వస్తేనే జగన్ భరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు టీడీపీ నేత, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. చంద్రబాబు ఇంటి పక్కనున్న ప్రజా వేదికను కూల్చిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. సీఎంగా ఉన్నంత వరకు పరదాలు కట్టుకుని తిరిగి, ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ పెటుకున్నారని ఎద్దేవా చేశారు.