Andhra Pradesh: హాస్టల్‌లో హిడెన్ కెమెరాలపై పోలీసుల కీలక ప్రకటన
కృష్ణా జిల్లాలోని గుడివాడ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో హాస్టల్ విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళన చేశారు.
By Srikanth Gundamalla Published on 30 Aug 2024 5:23 AM GMTAndhra Pradesh: హాస్టల్‌లో హిడెన్ కెమెరాలపై పోలీసుల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని గుడివాడ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో హాస్టల్ విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళన చేశారు. హాస్టల్‌లో రహస్య కెమెరాలను పెట్టి వీడియోలు రికార్డు చేశారంటూ నిరసన చేశారు. ఈ మేరకు ఒక సీనియర్ విద్యార్థిపై ఆరోపణలు కూడా వచ్చాయి. కొందరు విద్యార్థులు అతనిపై దాడి చేశారు. సెల్‌ఫోన్ టార్చ్ లైట్స్ వేస్తూ.. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం విద్యార్థినులు ఆందోళన చేస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాస్టల్ బాత్రూముల్లో కూడా హిడెన్ కెమెరాలను పెట్టారంటూ విద్యార్థినులు చెప్పారు. ఈ ఘటన సంచలనంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి వెంటనే చర్యలు చేపట్టారు.
ఈ మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందరు విద్యార్థుల ముందే వాటిని ఓపెన్ చేశారు. అందులో అన్నింటినీ చెక్ చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ గందాధర్‌రావు చెప్పారు. అలాగే హాస్టల్‌లో దాచిపెట్టిన కెమెరాలు ఎలాంటివి కనబడలేదని అన్నారు. విద్యార్థినులు, కాలేజీ సిబ్బంది ముందే అనుమానిత విద్యార్థుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను తనిఖీ చేశామని చెప్పారు. ఎలాంటి అనుమానిత వీడియోలను గుర్తించలేదని ఎస్పీ తెలిపారు. హిడెన్ కెమెరాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో విద్యార్థినులు ఆందోళన చెందారని.. వెంటనే నిరసన చేశారని ఈ మేరకు పోలీసులు తెలిపారు. అయితే.. ఎలాంటి కెమెరాలు, వీడియోలు లేవని తేల్చినట్లు చెప్పారు. విద్యార్థినులు ఆందోళన చెందొద్దని ఈ మేరకు ఎస్పీ గంగాధర్‌రావు అన్నారు. అయితే.. ఈ సంఘటనపై తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పారు.