ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్‌.. ఈ గట్టున రామ్‌చరణ్‌..ఆ గట్టున అల్లు అర్జున్

ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్‌ సంఘటనలు జరుగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  11 May 2024 9:30 AM GMT
andhra pradesh, election, ram charan, allu arjun,

 ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్‌.. ఈ గట్టున రామ్‌చరణ్‌..ఆ గట్టున అల్లు అర్జున్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం వచ్చేసింది. ప్రచారం ముగియడానికి కూడా ఇంకొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్‌ సంఘటనలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రంతో ఏపీలో ప్రచారానికి తెరపడనున్న విషయం తెలిసిందే. అయితే.. ఏపీ పాలిటిక్స్‌ క్యాంపెయిన్‌లో టాలీవుడ్‌ ప్రముఖ నటులు ఎంట్రీ ఇవ్వడంతో ఆసక్తికరంగా మారింది. గ్లోబల్‌ స్టార్ రామ్‌ చరణ్ ఇప్పటికే తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్‌తో కలిసి పిఠాపురం వెళ్లారు. రాజమండ్రిలో రామ్‌చరణ్‌కు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా రామ్‌చరణ్‌కు పూలు జల్లుతూ వచ్చారు. ఇక చెర్రీ వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇక పవన్ కల్యాణ్‌ నివాసంలో బాబాయ్‌ని చరణ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకు ముందు రామ్‌చరణ్‌ కుక్కుటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బాబాయ్‌ పవన్ కల్యాణ్‌ కు రామ్‌ చరణ్‌ మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ఇక మరోవైపు ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ కూడా నంద్యాలలో శనివారం సందడి చేశారు. అయితే.. ముందుగా అల్లు అర్జున్‌ కూడా జనసేనకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ పోటీ చేస్తున్న సందర్భంగా పిఠాపురం నుంచి ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు కూడా పెట్టారు. అయితే.. ఈ పోస్టు పెట్టిన రెండ్రోజుల తర్వాత తాజాగా అల్లు అర్జున్ రివర్స్ గేర్ వేశాడు. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాడు. తాజాగా అతను వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు.

అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన సతీమణి స్నేహారెడ్డితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ మేరకు అల్లు అర్జున్ దంపతులకు శిల్పా దంపతులు ఘనస్వాగతం పలికారు. ఇక అల్లు అర్జున్‌ నంద్యాలకు వచ్చారన్న విషయం తెలుసుకున్న అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వచ్చారు. పెద్ద ఎత్తున గుమిగూడిన అభిమానులకు.. బాల్కానీ నుంచి అల్లు అర్జున్ అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ఎన్నికల్లో తొలిసారి నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి శిల్పా రవిచంద్రారెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు.. అప్పుడు కూడా బన్ని తన మిత్రుడికి మద్దతు తెలిపారు.

ఒక వైపు కోనసీమలో రామ్‌చరణ్, మరోవైపు రాయలసీమ ప్రాంతంలో అల్లు అర్జున్‌ సందడి చేయడంతో ప్రచారం చివరి రోజున ఏపీ రాజకీయాల్లో సందడి కనిపిస్తోంది.

Next Story